
అమరావతి, 05 అక్టోబర్ (హి.స.)డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ముందుగా Learner Licence (LLR) పొందాల్సి ఉంది. ఇందుకోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి కంప్యూటర్ బేస్డ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందుకోసం రవాణశాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండేది. ఇందుకోసం సమయం వృథా అయ్యేది. ఇక దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించి వేలకు వేలు డబ్బులు కూడా వెచ్చిస్తున్నారు కొంతమంది వాహనదారులు. అయితే ఇక నుంచి అలాంటి అవసరం లేదు. మీ ఇంట్లోనే ఉండి ఎల్ఆర్ఆర్ పరీక్ష రాయొచ్చు. ఈ మేరకు ఆన్లైన్ విధానాన్ని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
ముందుగా సారథి పోర్టల్లో ఎల్ఎల్ఆర్ ఆన్లైన్ స్టాల్ ఆప్షన్లో క్లిక్ చేయాలి.
రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుని ఆధార్ వివరాలు నమోదు చేసి ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి.
అప్లికేషన్ జనరేట్ కాగానే మొబైల్ నంబరు నమోదు చేయాలి.
పిన్ ఎంటర్ చేసిన తర్వాత కెమెరా ఉన్న కంప్యూటర్/ల్యాప్టాప్ ఉపయోగించుకుని ఆన్లైన్లో పరీక్ష రాయాలి.
20 ప్రశ్నల్లో కనీసం 60శాతం (12 ప్రశ్నలకు) సరైన సమాధానం రాస్తే పాసైనట్లే. ఎల్ఎల్ఆర్ వచ్చిన తర్వాత ఆరు నెలల్లోపు ఆర్టీఏ కార్యాలయంలో డ్రైవింగ్ టెస్ట్కి నేరుగా హాజరు కావాలి.
ఆన్లైన్ పరీక్ష నేపథ్యంలో అక్రమాలకు అవకాశం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
అభ్యర్థులు సేఫ్ ఎగ్జామ్ బ్రౌజర్ ఉపయోగించాలి.
ఏఐ టూల్స్ డెస్క్టాప్/ల్యాప్టాప్ కెమెరా పరీక్ష రాసే అభ్యర్థిని నిశితంగా గమనిస్తుంది.
తల పక్కకు తిప్పినా, అక్కడ మరెవరి మాటలైనా వినిపించినా పరీక్షలో ఫెయిల్ అయినట్టే.
ఒక డెస్క్టాప్/ ల్యాప్టాప్ ఐపీ అడ్రస్తో రోజుకు ఇద్దరికి పరీక్ష రాసే అవకాశం ఉంది.
అభ్యర్థి ముఖం ఆధార్ అథెంటికేషన్తో సరిపోల్చేందుకు గరిష్ఠంగా ఐదు అవకాశాలు ఇస్తారు.
ఆధార్ ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే ఎల్ఎల్ఆర్ కోసం రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాలి.
కంప్యూటర్/ల్యాప్టాప్లు లేనివారు దగ్గరలోని స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి పరీక్ష రాసుకోవచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV