
హైదరాబాద్, 06 అక్టోబర్ (హి.స.)
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ను లక్ష్యంగా చేసుకుని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (CEO Telangana) ఫ్యాక్ట్ చెక్ లో స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి మేలు చేసేందుకు చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా ఓటర్ల నమోదు దరఖాస్తు 'ఫామ్-6'లో నిబంధనలను మార్చారంటూ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. అయితే ఈ పోస్ట్ను తోసిపుచ్చిన సీఈవో యంత్రాంగం, ఫామ్-6 డిక్లరేషన్కు సంబంధించి ఎన్నికల సంఘం తీసుకున్న ప్రతి నిర్ణయం కమిషన్ పూర్తి ఆమోదంతో పాటు గౌరవ సుప్రీంకోర్టు ఉత్తర్వులకు లోబడే జరిగిందని అధికారికంగా వెల్లడించింది.
బిహార్ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ కోసం 2025 జూన్ 24న జారీ చేసిన ఆదేశాలను ఎన్నికల సంఘం సభ్యులందరి ఏకగ్రీవ ఆమోదంతోనే అమలు చేశామని, ఈ ఉత్తర్వులను సుప్రీం కోర్టు తన 2026 మే 27 నాటి తీర్పులో సమర్థించిందని ఫ్యాక్ట్ చెక్ లో వివరించారు. అంతేకాకుండా, ఈసీఐ 2026 సెప్టెంబర్ 26న విడుదల చేసిన ప్రెస్ నోట్ (నం. 120)లోని పాయింట్ 1 (iii)లో కూడా.. ఎస్ఐఆర్ కోసం ఫామ్-6తో జతపరిచిన డిక్లరేషన్ను గౌరవ సుప్రీంకోర్టు సమర్థించింది అని స్పష్టంగా పేర్కొన్నట్లు రుజువులను ఉటంకించారు. రాజ్యాంగబద్ధ సంస్థల నిర్ణయాలపై ఆధారాలు లేని రాజకీయ ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించడం సరికాదని ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు