
అమరావతి , 06 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి సరఫరాను మరింత విస్తరించేందుకు భారీ కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలిసి జల్ జీవన్ మిషన్ 2.0 కింద భారీ గ్రామీణ నీటి సరఫరా పనులకు శ్రీకారం చూటింది. మొత్తం రూ.30,136 కోట్ల వ్యయంతో 50,315 పనులను చేపట్టానున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 27.36 లక్షల కొత్త గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు అందించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది.
గ్రామీణ కుటుంబాలకు ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. నీటి కోసం మహిళలు, కుటుంబ సభ్యులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడం, తాగునీటి ద్వారా వచ్చే వ్యాధులను నియంత్రించడం, గ్రామీణ జీవన ప్రమాణాలను మెరుగుపరచడం వంటి ప్రయోజనాలు ఈ కార్యక్రమం ద్వారా కలగవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఇది కేవలం పైపులైన్లు వేయడం మాత్రమే కాకుండా నీటి వనరుల అభివృద్ధి, నిల్వ, శుద్ధి, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడంపైనా ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ఉన్న పథకాలను కొత్త పనులతో అనుసంధానం చేయడం, గ్రామాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా నీటి వనరులను ఎంపిక చేయడం వంటి అంశాలు ప్రాజెక్టు విజయానికి కీలకం కానున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటే పనుల నిర్మాణంతో పాటు నిర్వహణ కూడా ముఖ్యమే. పైపులైన్లు వేసిన తర్వాత వాటి నిర్వహణ, నీటి నాణ్యత పరీక్షలు, విద్యుత్ సరఫరా, నీటి వనరుల స్థిరత్వం వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. రూ.30 వేల కోట్లకు పైగా విలువైన ఈ కార్యక్రమం అమలు రాష్ట్ర గ్రామీణ మౌలిక వసతులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్