
హైదరాబాద్, 20 నవంబర్ (హి.స.)
శివకేశవుల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైన కార్తిక మాసంలో, శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ తిథులను కలిపి ‘పంచపర్వాలు’ అని పిలుస్తారు. వీటినే భీష్మ పంచకం అని కూడా అంటారు. కార్తిక మాసం మొత్తం ఒక ఎత్తయితే, చివరి ఐదు రోజులైన ఈ పంచపర్వాలు మరో ఎత్తుగా ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఈ ఐదు రోజులూ నియమనిష్ఠలతో దీపారాధన, ఉపవాసం, వ్రతాలు, దానాలు చేస్తే అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని కార్తిక పురాణం పేర్కొంటోంది.
కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్యపై ఉన్న భీష్మాచార్యుడు, శ్రీకృష్ణుడిని ధర్మసందేహాలు అడిగి నివృత్తి చేసుకున్న పవిత్రమైన రోజులు ఇవేనని పురాణాలు చెబుతున్నాయి. భీష్ముడు ఈ ఐదు రోజులూ శ్రీకృష్ణుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఈ పంచపర్వాల విశిష్టతను, ఈ రోజుల్లో ఆచరించాల్సిన వ్రతాలు, దీపారాధన ఫలాలను లోకానికి తెలియజేశాడు. భీష్మాచార్యుడికి అత్యంత ప్రీతికరమైన, ఆయన స్మరణతో ముడిపడిన ఐదు రోజులు కావడం వల్ల వీటికి భీష్మ పంచకం అనే పేరు వచ్చింది.
సాధారణంగా కార్తిక మాసమంతా వ్రతాలు, దీపారాధన చేయలేని వారు, కనీసం ఈ చివరి ఐదు రోజులైన భీష్మ పంచకంలో నియమనిష్ఠలతో దీపాలు వెలిగించి, విష్ణుమూర్తిని, శివుడిని పూజిస్తే కార్తిక మాసం మొత్తం చేసినంత పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు
కార్తిక శుద్ధ ఏకాదశి దీన్నే ఉత్థాన ఏకాదశి (లేదా ప్రబోధిని ఏకాదశి) అంటారు. ఈనాడు, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువు మేల్కొంటాడని విశ్వాసం. భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని, తులసిమాతను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
రెండో రోజు కార్తిక శుద్ధ ద్వాదశి. క్షీరాబ్ధి ద్వాదశి (చిలుకు ద్వాదశి). ఈ రోజున తులసి కోట వద్ద ఉసిరి చెట్టు నీడలో విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, తులసిదేవికి వేడుకగా వివాహం జరిపిస్తారు. క్షీరసాగరంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిన పవిత్ర ఘట్టాన్ని స్మరించుకుంటూ సాయంత్రం దీపాలు వెలిగించి, విందు భోజనాలు చేస్తారు.
మూడో రోజు.. కార్తిక త్రయోదశి నాడు శివకేశవులను ఆరాధించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ప్రదోష కాలంలో శివాలయాలలో దీపారాధన చేసి, అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు.
నాలుగో పర్వం వైకుంఠ చతుర్దశి హరిహరుల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ రోజున శివుడిని, విష్ణుమూర్తిని ఏకకాలంలో పూజిస్తారు. వైకుంఠ చతుర్దశి రోజున చేసే పూజలు, దీపదానాలు సకల పాపాలను తొలగించి వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తాయని భక్తుల నమ్మకం.
ఇక చివరి రోజున కార్తిక పూర్ణిమ అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో సాగుతుంది. త్రిపురాసురుడిని పరమేశ్వరుడు సంహరించిన రోజుగా, అందుకే దీనిని త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరించిన పర్వదినం కూడా ఇదే. తెల్లవారుజామునే పుణ్యనదులలో స్నానాలు ఆచరించడం, శివాలయాలలో జ్వాలా తోరణం వేడుకలు, 365 ఒత్తుల దీపారాధన, దీపాలను నదులలో వదలుతారు. ఉసిరి చెట్టు కింద ప్రకృతి ఒడిలో నిర్వహించే వనభోజనాలు సామూహికతకు, ఆనందానికి ప్రతీకగా నిలుస్తాయి. పూర్ణిమ చంద్రుని వెన్నెలలో సాగే ఈ ఆధ్యాత్మిక వేడుకలు మనసులోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని కలిగిస్తాయి. అలా ప్రకృతిని, తోటివారిని గౌరవించే సంస్కృతిని, ఆధ్యాత్మిక చింతనను ఈ పంచపర్వాలు మనకు గుర్తుచేస్తాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi