
హైదరాబాద్ , 23 నవంబర్ (హి.స.)
తెలంగాణ కాంగ్రెస్లో పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరుపై సమీక్షించేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సందీప్ గాంధీభవన్లో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఆయన భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ కూడా పాల్గొననున్నారు.
అనంతరం రాష్ట్ర మంత్రులతో సందీప్ విడివిడిగా సమావేశమై వారి శాఖల పనితీరును సమీక్షించనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు, మంత్రుల పనితీరు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై వివరాలు తెలుసుకోనున్నట్లు సమాచారం. ఈ భేటీలకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారు.
మంత్రులతో సమావేశాలు ముగిసిన తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీల (డీసీసీ) అధ్యక్షులతో సందీప్ చర్చించనున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, జిల్లాల్లో సంస్థాగత కార్యకలాపాలు, నాయకుల మధ్య సమన్వయం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం పీసీసీ అనుబంధ విభాగాల ప్రతినిధులతోనూ ఆయన సమావేశం కానున్నారు. వరుస భేటీల నేపథ్యంలో గాంధీభవన్లో కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్