రాజమహేంద్రవరం నుంచి గొప్ప నాగరికత అభివృద్ధి చెందింది: సీఎం చంద్రబాబు
రాజమహేంద్రవరం చరిత్ర, సంస్కృతి, నాగరికతకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
Chandrababu Naidu


రాజమహేంద్రవరం, 28 నవంబర్ (హి.స.)రాజమహేంద్రవరం చరిత్ర, సంస్కృతి, నాగరికతకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టు 222 ఏళ్లు పూర్తి చేసుకోవడం, బార్ అసోసియేషన్ 131వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన న్యాయ ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాజమహేంద్రవరం కేంద్రంగా గొప్ప నాగరికత, సంస్కృతి అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజీ ఈ ప్రాంత రూపురేఖలను మార్చిందని, గోదావరి పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిందని గుర్తుచేశారు. గోదావరి జిల్లాల్లో పండే పంటల కారణంగానే ఆంధ్రప్రదేశ్కు దేశానికి అన్నపూర్ణగా, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు వచ్చిందని వివరించారు.

రాష్ట్ర అభివృద్ధిలో సాగునీటి ప్రాజెక్టుల పాత్ర ఎంతో కీలకమని సీఎం అన్నారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాదికి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. న్యాయవ్యవస్థ ప్రజలకు న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొంటూ న్యాయ ఉత్సవంలో పాల్గొన్న న్యాయమూర్తులు, న్యాయవాదులకు శుభాకాంక్షలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande