బంగారు ఆభరణాల కోసం హత్య.....ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు
బంగారు ఆభరణాల కోసం 2023లో జరిగిన మహిళ హత్య కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శివకుమార్ తీర్పు వెలువరించారు.
Court decision


కరీంనగర్, 28 నవంబర్ (హి.స.)

బంగారు ఆభరణాల కోసం 2023లో జరిగిన మహిళ హత్య కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శివకుమార్ తీర్పు వెలువరించారు. జీవిత ఖైదుతో పాటు నిందితులకు ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లికి చెందిన గూండారపు ప్రమీల (58), అనారోగ్యంతో ఉన్న తన తండ్రి ఇజిగిరి కొమురయ్య (68) వద్దకు శంకరపట్నం మండలం ఆర్కండ్లకు వచ్చారు. 2023 అక్టోబర్ 1న తాయత్తు కట్టించేందుకు వారిద్దరూ మొలంగూర్ గ్రామానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమీల వద్ద ఉన్న బంగారు నగలను కాజేయాలనే ఉద్దేశంతో నిందితులు తాయత్తు కట్టిస్తామని మాయమాటలు చెప్పి, ఆటోలో శంకరపట్నం మండలం తాడికల్ శివాలయ ఆవరణ సమీపానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై కత్తితో దాడి చేసి హత్య చేసి, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతో పరారయ్యారు.

అప్పటి ఎస్సై లక్ష్మారెడ్డి కేసు నమోదు చేయగా, గ్రామీణ సీఐ సంతోష్కుమార్ దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేసి సాక్ష్యాధారాలు సేకరించారు. విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్యాల ప్రతాప్ వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో కోర్టు ఈ కఠిన శిక్ష విధించింది. కేసులో సమర్థవంతంగా వాదనలు, దర్యాప్తు నిర్వహించిన పోలీసు అధికారులు, ప్రాసిక్యూషన్ సిబ్బందిని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande