సముద్రపు అలల ధాటికి తెప్ప బోల్తా.. మత్స్యకారుడు మృతి
శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చేపల వేట ముగించుకుని ఒడ్డుకు తిరిగి వస్తున్న మత్స్యకారుల తెప్ప సముద్రపు అలల ఉద్ధృతికి బోల్తా పడింది.
Accident


శ్రీకాకుళం జిల్లా, 28 నవంబర్ (హి.స.)

శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చేపల వేట ముగించుకుని ఒడ్డుకు తిరిగి వస్తున్న మత్స్యకారుల తెప్ప సముద్రపు అలల ఉద్ధృతికి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు సురక్షితంగా బయటపడటంతో ప్రమాదం నుంచి ఊపిరి పీల్చుకున్నారు.

వజ్రపుకొత్తూరు మండలం దేవునళ్తాడ సముద్ర తీరంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఐదుగురు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వేట ముగించుకుని తిరిగి తీరానికి చేరుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బలమైన అలలు తెప్పను తాకాయి. దీంతో అదుపుతప్పిన తెప్ప సముద్రంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మోహనరావు (50) అనే మత్స్యకారుడు మృతి చెందారు. తెప్పలో ఉన్న మిగిలిన నలుగురు మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు.

మోహనరావు మృతితో దేవునళ్తాడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మత్స్యకారుడి మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande