
సిక్కిం, 08 నవంబర్ (హి.స.)
దీపావళి సందర్భంగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సిక్కిం సరిహద్దులో సైనికుల మధ్య పండుగ జరుపుకున్నారు. సరిహద్దు కాపలాలో ఉన్న జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. అక్కడున్న సైనికులందరికీ, వారి కుటుంబాలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వారందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
అంతకు ముందు షెరతాంగ్లోని యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు రాజ్నాథ్ సింగ్ నివాళి అర్పించారు. అనంతరం అక్కడ విధుల్లో ఉన్న సైనికులను కలిసి వారితో కొద్దిసేపు ముచ్చటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. యుద్ధ స్మారకాలు కేవలం మరణించిన వారి జ్ఞాపకార్థం మాత్రమే కాదు, బతికున్న వారికి స్ఫూర్తినిచ్చేందుకు కూడా నిర్మిస్తారని చెప్పారు. దేశం కోసం ప్రాణాలొదిలిన సైనికుల ధైర్యం, అంకితభావం ప్రజల గుండెల్లో ఎప్పుడూ నిలిచే ఉంటుందని, వారి రుణం దేశం ఎన్నటికీ తీర్చుకోలేదని పేర్కొన్నారు.
కఠిన వాతావరణం, కష్టమైన భౌగోళిక పరిస్థితుల్లోనూ సైనికులు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా దేశభక్తితో విధులు నిర్వహిస్తున్నారని మంత్రి కొనియాడారు. సైనికులను దీపాలతో పోలుస్తూ.. వారు చీకటిని పారద్రోలి దేశంలోని ప్రతి ఇంటికీ భద్రత అనే వెలుగును పంచుతున్నారని అభివర్ణించారు. వేల దీపాల వెలుగు కంటే సైనికుల అప్రమత్తత, దేశభక్తి, ఆత్మవిశ్వాసమే ఎక్కువగా ప్రకాశిస్తాయని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..