
హైదరాబాద్, 01 ఫిబ్రవరి (హి.స.) లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సందర్భంగా, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్క్రీన్‌లలో బడ్జెట్ ప్రత్యక్ష ప్రసారాన్ని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు గారు వీక్షించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, గౌరవనీయ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ‘వికసిత్ భారత్’ నిర్మాణ సంకల్పం ఇక ఆశయంగా మాత్రమే కాకుండా, వాస్తవంగా మారే దిశగా దేశాన్ని దృఢంగా ముందుకు నడిపిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్ గర్వకారణమని తెలిపారు. హైదరాబాద్‌కు హైస్పీడ్ రైల్ కారిడార్ల ప్రకటనతో రాష్ట్రం జాతీయ వృద్ధి యంత్రంగా మరింత బలపడనుందని అన్నారు.
ఇది మార్పును తీసుకొచ్చే బడ్జెట్ అని పేర్కొంటూ, ఆర్థిక బలమునుంచి జాతీయ సామర్థ్యానికి, అంత్యోదయంనుంచి అభ్యుదయానికి దేశాన్ని నడిపించే స్వర్ణయాత్రకు ఈ బడ్జెట్ పునాది వేస్తోందని చెప్పారు. పచ్చని పొలాలు, బలమైన ధాన్యాగారాలు, ప్రతి కుటుంబంలో చిరునవ్వులు — ఇవన్నీ ఈ బడ్జెట్ లక్ష్యాలని వివరించారు.
ఆత్మనిర్భర్ భారత్ దృష్టితో రూపొందిన ఈ బడ్జెట్ దేశీయ తయారీ రంగానికి ఊతమివ్వడంతో పాటు, ఇంధన భద్రతను బలోపేతం చేస్తోందని, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించే దిశగా కీలక సంస్కరణలను తీసుకొస్తోందని అన్నారు. ఉపాధి సృష్టి, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, కొనుగోలు శక్తి వృద్ధి, నాణ్యమైన విద్యా–వైద్య సేవల విస్తరణకు ఈ బడ్జెట్ బలమైన పునాదిని వేస్తోందన్నారు.
ఈ నిరంతర విధానాల ఫలితంగా భారతదేశం సుమారు 7 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతోందని, పేదరికం తగ్గింపులో చారిత్రాత్మక పురోగతి సాధించిందని తెలిపారు. ప్రతి వర్గాన్ని వెంట తీసుకెళ్లే ఈ #ViksitBharatBudget దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా కీలకంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
పేదల సంక్షేమం, రైతుల సౌభాగ్యం, మహిళల సాధికారత, యువత ఆశయాలకు అంకితమైన ఈ ప్రజాకేంద్రిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు