
ఢిల్లీ,17 ,ఫిబ్రవరి (హి.స.) : కృత్రిమ మేధ (ఏఐ) రంగంపై విస్తృతంగా చర్చించేందుకు, అత్యాధునిక ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు భారత్ ఆతిథ్యమిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో-2026, సమిట్‌లు సోమవారం దిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకూ భారత్ మండపం, సుష్మా స్వరాజ్ భవన్, అంబేడ్కర్ సెంటర్ వేదికలుగా జరగనున్న ఈ ఎక్స్‌పో, సమిట్‌లను సోమవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఏఐ ప్రయాణంలో భారత్ ముందు వరుసలో నిలిచిందని, దాని పురోగతి.. లక్ష్యం, బాధ్యతలను ప్రతిబింబిస్తుందని ఈ సందర్భంగా ఎక్స్‌లో ఆయన ప్రకటించారు.
ఏఐపై చర్చించడానికి ప్రపంచాన్ని ఒక దగ్గరకు చేర్చామని ప్రధాని పేర్కొన్నారు. ‘ప్రపంచ దేశాల నేతలను, పారిశ్రామిక దిగ్గజాలను, ఆవిష్కర్తలను, విధాన నిర్ణేతలను, పరిశోధకులను, టెక్నాలజీ ఔత్సాహికులను ఈ సదస్సు కోసం ఘనంగా స్వాగతిస్తున్నాం.
ఈ సమిట్ థీమ్‌గా సర్వజన హితాయ.. సర్వజన సుఖాయ (అందరి సంక్షేమం) ఉంది. మానవాభివృద్ధి కేంద్రంగా ఏఐని తీర్చిదిద్దడానికి కట్టుబడి ఉన్నాం. ప్రస్తుతం ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పాలన, వ్యాపారం వంటి పలు రంగాలను ఏఐ ప్రభావితం చేస్తోంది. ఆవిష్కరణ, భాగస్వామ్యంతోపాటు బాధ్యతగా వ్యవహరించడంలో దానిని సమర్థంగా వినియోగించేందుకు ఈ సదస్సు దోహదం చేయనుంది. సదస్సు ఫలితాలు భవిష్యత్తు అభివృద్ధి, ఆవిష్కరణ, అవకాశాలకు ఓ రూపు తెస్తాయని నమ్ముతున్నా. ఏఐ ప్రయాణంలో ముందున్నందుకు సహకరించిన 140 కోట్ల మంది భారతీయులకు ధన్యవాదాలు’ అని ప్రధాని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ