గొగోయ్‌పై సీఎం ఆరోపణలు... సర్వే ఏం చెప్పిందంటే.
గొగోయ్‌ పాకిస్థాన్ ఏజెంట్ అంటూ సీఎం చేసిన ఆరోపణలపై ఆసక్తికరమైన సర్వే జరిగింది. ఈనెల 13, 14 తేదీల్లో జరిగిన ఈ సర్వేలో మెజారిటీ అస్సాం ఓటర్లు సీఎం ఆరోపణలను విశ్వసించడం లేదని వెల్లడైంది.
Gogoi


హైదరాబాద్, 18 ఫిబ్రవరి (హి.స.)అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ , అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ మధ్య ఆరోపణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. గొగోయ్ 'పాకిస్థాన్ ఏజెంట్' అంటూ హిమంత సంచలన ఆరోపణలు చేయగా, సీఎం కుటుంబ భూములపై గొగోయ్ ప్రతివిమర్శలు చేశారు. ఆయన ఆరోపణలపై హిమంత పరువునష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో గొగోయ్‌ పాకిస్థాన్ ఏజెంట్ అంటూ సీఎం చేసిన ఆరోపణలపై ఆసక్తికరమైన సర్వే జరిగింది. ఈనెల 13, 14 తేదీల్లో జరిగిన ఈ సర్వేలో మెజారిటీ అస్సాం ఓటర్లు సీఎం ఆరోపణలను విశ్వసించడం లేదని వెల్లడైంది. 'ఇండియా టుడే-సి ఓటర్' ఈ సర్వే నిర్వహించింది.

అసోం సీఎం ఆరోపించినట్టు గౌరవ్ గొగోయ్ పాకిస్థాన్ ఏజెంట్ అని మీరు నమ్ముతున్నారా? అనే ప్రశ్నకు 55 శాతం మంది నమ్మడం లేదని, 30 శాతం మంది అవునని సమాధానమిచ్చారు. మతపరమైన గ్రూపులలో 69 శాతం ముస్లింలు గొగోయ్‌పై చేసిన ఆరోపణలను తోసిపుచ్చగా, 49 శాతం మంది హిందువులు ఈ ఆరోపణలు విశ్వసనీయంగా అనిపించడం లేదన్నారు. కేవలం 13 శాతం మంది ముస్లింలు, 39 శాతం హిందువులు ఈ ఆరోపణలను నమ్ముతున్నట్టు చెప్పారు. తక్కిన 15 శాతం మంది ఎటూ తేల్చిచెప్పలేదు.

ముఖ్యమంత్రి ఆరోపణలను గౌరవ్ గొగోయ్ తోసిపుచ్చడంపై ఓటర్లను ప్రశ్నించినప్పుడు గొగోయ్‌‌ వాదనను 38 శాతం మంది సమర్ధించారు. 40 శాతం మంది ఏకీభవించలేదు. 22 శాతం మంది ఎటూతేల్చిచెప్పలేదు. హిందువులలో 52 శాతం మంది గొగోయ్ వాదన నమ్మశక్యంగా లేదని అభిప్రాయపడగా, 53 శాతం ముస్లింలు ఆయన వాదనతో ఏకీభవిస్తున్నట్టు చెప్పారు.

పాకిస్థాన్‌తో గౌరవ్ గొగోయ్‌ సంబంధాలపై హిమంత శర్మ ఈనెల 7న క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమైనందున ఈ అంశంపై దర్యాప్తును కేంద్ర హోం శాఖకు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనిపై గొగోయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. సిట్ దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని, తాను ఎప్పటి నుంచో సిట్ దర్యాప్తు వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలోని పలుచోట్ల సీఎం కుటుంబానికి భూములున్నాయనే విషయాన్ని తాము బయటపెట్టడంతోనే సీఎం ఎదురుదాడికి దిగినట్టు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande