ఏఐ సదస్సు దేశ అభివృద్ధికి టర్నింగ్ పాయింట్ : ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, 22 ఫిబ్రవరి (హి.స.) భారత్ లో అతిపెద్ద ఏఐ సదస్సును నిర్వహించామని, ఇది దేశ అభివృద్ధికి టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. మన్ కీ బాత్ 131వ ఎపిసోడ్ లో ఆదివారం మోదీ మాట్లాడుతూ.. ఏఐ ఇండియా ఆవిష్కర్తలను అభిన
మోదీ


న్యూఢిల్లీ, 22 ఫిబ్రవరి (హి.స.)

భారత్ లో అతిపెద్ద ఏఐ సదస్సును

నిర్వహించామని, ఇది దేశ అభివృద్ధికి టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. మన్ కీ బాత్ 131వ ఎపిసోడ్ లో ఆదివారం మోదీ మాట్లాడుతూ.. ఏఐ ఇండియా ఆవిష్కర్తలను అభినందించారు. ఈ సదస్సుతో భారత్ సామర్థ్యాలకు ప్రపంచమే సాక్షిగా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సుకు ప్రపంచ నేతలు హాజరవ్వడం ద్వారా దేశానికి మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే.. డిజిటల్ నేరాలు, పరీక్షల ఒత్తిడి, కుంభమేళా ప్రాశిష్ట్యం, దేశీయ సంస్కృతి వంటి పలు కీలక అంశాలపై కూడా మోదీ తన అభిప్రాయాలు, సూచనలను పంచుకున్నారు.

డిజిటల్ అరెస్టులపై హెచ్చరిక

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ అరెస్ట్, డిజిటల్ ఫ్రాడ్ వంటి విషయాలపై గతంలోనే అవగాహన కల్పించినా, ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతుండటం విచారకరమన్నారు. ప్రతి ఒక్కరూ కేవైసీ (KYC) ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

పరీక్షల వేళ విద్యార్థులకు సందేశం

పరీక్షల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన 'పరీక్షా పే చర్చ' కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులంతా 'ఎగ్జామ్ వారియర్స్' (Exam Warriors) అనిస అందరూ పూర్తి ఆత్మవిశ్వాసంతో, పరీక్షలకు కష్టపడి సిద్ధమవుతున్నారని నమ్ముతున్నానని, ధైర్యంగా పరీక్షలు రాయాలని భరోసా ఇచ్చారు.

ఒడిశా రైతు 'హిరోద్ పటేల్' కథనం

ఒడిశాకు చెందిన యువ రైతు హిరోద్ పటేల్ కృషిని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎనిమిదేళ్ల క్రితం వరకు తన తండ్రి శివశంకర్ పటేల్తో కలిసి సంప్రదాయ పద్ధతిలో వరి సాగు చేసిన హిరోద్, ఇప్పుడు వ్యవసాయాన్ని సరికొత్త కోణంలో చూస్తున్నారు. ఆయన విజయగాథ దేశంలోని యువ రైతులందరికీ స్ఫూర్తిదాయకం అని ప్రధాని కొనియాడారు.

కుంభమేళా & సనాతన స్పృహ..

గతేడాది జరిగిన మహాకుంభమేళా దృశ్యాలను గుర్తుచేసుకుంటూ.. భారతదేశం తన వారసత్వాన్ని తిరిగి గుర్తించే క్రమంలో చరిత్ర మరో మలుపు తిరిగిందని, కేరళలో ఎటువంటి ఆర్భాటం లేకుండా కుంభమేళా నిర్వహించడాన్ని ఆయన ప్రశంసించారు. ఇది భారతీయ సనాతన చేతనకు నిదర్శనమని పేర్కొన్నారు.

రాజాజీ ఉత్సవం..

ఫిబ్రవరి 23న రాష్ట్రపతి భవన్లో రాజాజీ ఉత్సవం నిర్వహించనున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఫిబ్రవరి 24 నుండి మార్చి 1 వరకు ఆరు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను సందర్శించాలని ఆయన కోరారు.

చిన్నారి సారంగ త్యాగంపై భావోద్వేగం..

కేరళకు చెందిన 10 ఏళ్ల చిన్నారి సారంగ గురించి ప్రధాని ప్రత్యేకంగా మాట్లాడారు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఈ బాలుడు ఒక ప్రమాదంలో 'బ్రెయిన్ డెడ్' కు గురయ్యాడు. ఆ కఠిన సమయంలో కూడా సారంగ తల్లిదండ్రులు ధైర్యంగా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారని ప్రధాని కొనియాడారు. సారంగ ప్రాణాలు కాపాడలేమని తెలిసినప్పుడు, ఆ చిన్నారి తల్లిదండ్రులు తమ కొడుకు అవయవాలను దానం చేసేందుకు ముందుకు రావడం అభినందించాల్సిన విషయమన్నారు. చిన్నారి అవయవాల వల్ల నేడు ఏడుగురు వ్యక్తులు కొత్త జీవితాన్ని పొందుతున్నారని, ఈ గొప్ప త్యాగం అవయవదానం పట్ల మన సమాజంలో ఉన్న అవగాహనకు నిదర్శనంగా నిలుస్తుందని ఆశించారు. సారంగ జీవితం మనందరికీ ఒక స్పూర్తి అని ప్రధాని భావోద్వేగానికి లోనయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande