
ఖమ్మం, 28 ఫిబ్రవరి (హి.స.)
కబ్జాలు చేసిన పెద్దలను వదిలేసి కేవలం నిరుపేదల ఇండ్లు కూల్చివేయటం ఏంటని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatela Rajender) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అసైండ్, ఇనాం, భూదాన్ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయో లెక్కలు తీసే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని చాలెంజ్ చేశారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల కూల్చివేతల (Velugumatla Demolition) బాధితులను ఇవాళ ఈటల రాజేందర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ భూములపై గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా కన్నేసిందని నాడు ప్రజల తిరుగుబాటును చూసి కేసీఆర్ వెనక్కి తగ్గారన్నారు. రేవంత్ రెడ్డికి (Revanth Reddy) పేదల ఇళ్లను కూల్చడమొక్కటే తెలుసని పేదలకు భూములు ఇవ్వకపోగా ఉన్నది కూడా లాక్కుంటోందని ధ్వజమెత్తారు.
శత్రుదేశం దాడి చేసినట్లు దాడి చేశారు:
తెలంగాణ ప్రభుత్వం పేదల ఇళ్లపై కన్నేసిందని రాష్ట్రంలోని పేదల కులమంతా ఒక్కటేనన్నారు. పేదల జోలికి వస్తే ప్రభుత్వం భరతం పడతామని హెచ్చరించారు. శత్రుదేశం దాడి చేసినట్లుగా ప్రభుత్వం పోలీసులను మోహరించి పేదల ఇళ్లను కూల్చివేశారన్నారు. పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఈ ఘటనతో తేలిపోయిందన్నారు. కూల్చచివేసిన చోటే కొత్త ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు