
షాద్నగర్, 28 ఫిబ్రవరి (హి.స.)
పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి
ఒక్క పేదవాడికి అండగా నిలబడాలని, ప్రజల దయాదాక్షణలతోనే అధికారంలోకి వచ్చామని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీ లోని 28 వార్డులలోని డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమానికి శనివారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదల కళలు సాకారం అవుతున్నాయని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవంగా బతకాలని, తినడానికి కూడు, ఉండటానికి గూడు కల్పించేందుకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు పేదల సంక్షేమమే లక్ష్యంగా చేస్తున్నాయని అన్నారు. పని
గత ప్రభుత్వ హయాంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలని మొదలుపెట్టి అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణాలను వదిలేసారని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని దూస్కల్, సోలిపూర్, హాజిపల్లి గ్రామ శివారులో 1500 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్, అధికారులు, కాంట్రాక్టర్ తో సమావేశం ఏర్పాటు చేసి రూ. 8 కోట్ల నిధులను తీసుకువచ్చి డబల్ బెడ్ రూమ్ నిర్మాణాలను పూర్తి చేశామని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో ఏ వార్డుకు వెళ్లినా ప్రజలు డబల్ బెడ్ రూమ్ ఇళ్లను అడిగారని, వారు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు తాగునీరు, డ్రైనేజ్, విద్యుత్ వ్యవస్థలను కల్పించేందుకు సమయం పట్టిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరీ చేస్తున్నామని అన్నారు.
షాద్ నగర్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే 1500 మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 300 మంది లబ్ధిదారులు దరఖాస్తులు కొత్తగా చేసుకున్నారని తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలని ఎలాంటి తప్పులు జరగా కాకుండా అధికారులు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేశారని తెలిపారు. నియోజకవర్గంలో 1700 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తున్నామని, ఇల్లు రాని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తన పరిధిలో 3500 ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయని, వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీలు పక్కనపెట్టి డబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్, బ్లాక్ లలో ప్రజల సమస్యలను తన దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా కౌన్సిలర్ల అందరికీ సహకరిస్తానని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పొందిన లబ్ధిదారులు సంతోషంగా గృహప్రవేశాలు చేసుకుని ఆనందంగా ఉండాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు