
సూర్యాపేట, 28 ఫిబ్రవరి (హి.స.) డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమైనదని, డ్రైవర్ కంటి చూపు బాగా ఉంటేనే వాహనాన్ని సమర్థవంతంగా నడపగలుగుతాడని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. అరైవ్ అలైవ్ రెండో విడత అవగాహన కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల వాహన డ్రైవర్లకు శనివారం సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక రవి మహాల్లో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. చాలా కష్టతరమైన డ్రైవర్ వృత్తిని ఎంచుకుని ఆరోగ్యాలను లెక్క చేయకుండా డ్రైవర్లు నిర్విరామంగా కష్టపడుతున్నారన్నారు. వయస్సు పెరిగే కొద్ది కంటి చూపు మందగించడం సహజమని, క్రమం తప్పకుండా కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకుని తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకం : ఎస్పీ నరసింహ
కంటి చూపు స్పష్టంగా ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి సూచనలు సరిగ్గా గుర్తించి సురక్షితంగా వాహనాలు నడపగలరని తెలిపారు. చాలా మంది డ్రైవర్లు కంటి చూపును అశ్రద్ధ చేస్తున్నారనే ఉద్దేశంతో స్థానిక లయన్స్ క్లబ్ డాక్టర్లు, గ్లోబల్ కంటి హాస్పటల్ డాక్టర్ల సహకారంతో కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకమన్నారు. ప్రతి వాహనదారుడు డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలన్నారు. జిల్లాలో 2024లో 278 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా 2025లో జిల్లా పోలీస్ శాఖ తీసుకున్న పటిష్ట చర్యల వల్ల రోడ్డు ప్రమాద మరణాలు 58కి తగ్గించగలిగామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు