
అనంతపురం, 03 ఫిబ్రవరి (హి.స.)అనంతపురం జిల్లాలో తల్లీకొడుకుల దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని శింగనమల మండలం తరిమెల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కుమారుడు అత్యంత అమానుషంగా హత్యకు గురయ్యారు. ఈ దారుణ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది.
వివరాల్లోకి వెళితే.. తరిమెల గ్రామానికి చెందిన నల్లప్పకు ఇద్దరు భార్యలు ఉండగా, ఆయన మృతి అనంతరం ఆస్తి పంపకాల విషయంలో మొదటి భార్య పిల్లలకు, రెండో భార్యకు మధ్య కొంతకాలంగా తీవ్ర వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్న నల్లప్ప రెండో భార్య యల్లమ్మ (38), ఆమె కుమారుడు చిన్నా (22) హత్యకు గురయ్యారు. మొదటి భార్యకు చెందిన కుమారులే ఈ హత్యలకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భూమి సహా ఆస్తుల పంపిణీపై తలెత్తిన ఘర్షణలే ఈ జంట హత్యలకు కారణమని పోలీసులు అంచనా వేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV