చివరి దశకు నక్సలిజం- ప్రభావిత జిల్లాలు మూడుకు తగ్గింపు.. కేంద్రం ప్రకటన
హైదరాబాద్, 04 ఫిబ్రవరి (హి.స.) నక్సలిజం చివరి దశకు వచ్చినట్టు... మావోయిస్టు ప్రభావిత జిల్లాలు నేడు కేవలం మూడే ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది 364 మంది నక్సలైట్లు ఎన్కౌంటర్ అయ్యారని, మరో 1022 మంది అరెస్టయ్యారని కేంద్రం వివరించింది
Naxals


హైదరాబాద్, 04 ఫిబ్రవరి (హి.స.)

నక్సలిజం చివరి దశకు వచ్చినట్టు... మావోయిస్టు ప్రభావిత జిల్లాలు నేడు కేవలం మూడే ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది 364 మంది నక్సలైట్లు ఎన్కౌంటర్ అయ్యారని, మరో 1022 మంది అరెస్టయ్యారని కేంద్రం వివరించింది. గత ఐదేళ్లలో 7,409 మంది నక్సలైట్లు అరెస్టవ్వగా, 5,880 మంది లొంగిపోయినట్టు తెలిపింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నక్సలిజం అంతానికి ప్రకటించిన డెడ్లైన్(ఈ ఏడాది మార్చి 31) మరో రెండు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజా వివరాలు వెల్లడించింది. మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం 2015లోనే ఓ ప్రత్యేక విధానాన్ని స్వీకరించింది. కేంద్రం, ప్రభావిత రాష్ట్రాలు ఉమ్మడిగా అమలు చేసిన ఈ విధానంలో కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టింది.

పోలీసులు, శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోకి వచ్చే అంశమైనా మావోయిజం అంతానికి రాష్ట్రాలతో కలిసి పని చేసిందని కేంద్ర హోం శాఖ లోక్సభలో తాజాగా వెల్లడించింది. బలగాల శిక్షణ, నిర్వహణా ఖర్చులు, పునరావాసానికి, పరిహారాలకు 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రూ.3,681.73 కోట్లు కేంద్రం ఖర్చు చేసింది. హైక్యాడర్ నక్సలైట్కు లొంగిపోయిన తక్షణమే రూ.5 లక్షలు, లో క్యాడర్కు రూ. 2.5 లక్షలు అందించాలని ఈ పాలసీలో నిర్ణయించుకున్నారు. ఆయుధాలు అప్పగించివారికి ఇన్సెంటివ్ లు అందించాలనీ పొందుపరిచారు. లొంగిపోయిన మావోయిస్టులకు మూడేళ్లపాటు నెలకు రూ. 10 వేల స్టైపండ్నూ నిర్ణయించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande