
ఢిల్లీ,04,ఫిబ్రవరి (హి.స.)
భాజపా ప్రతినిధి షెహజాద్ పూనావాలా (Shehzad Poonawalla) కీలక ఆరోపణలు చేశారు. తన తల్లిని ఎవరో ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టారన్నారు. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.
‘కొన్ని గంటల క్రితం ఓ వ్యక్తి నా తల్లిని ఉద్దేశపూర్వకంగా తన కారుతో ఢీకొట్టాడు. ఆమెను తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పారిపోయాడు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు’ అని రాసుకొచ్చారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ పోస్టుకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో పాటు ఆయన కార్యాలయాన్ని, స్థానిక పోలీసులను ట్యాగ్ చేశారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గాయపడిన తన తల్లి చిత్రాలను కూడా ఆయన పంచుకున్నారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. ఇక, భాజపా ప్రతినిధి సోదరుడు తెహసీమ్ పునావాలా ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పంచుకున్నారు. దీనికి ‘మా అమ్మ సీనియర్ సిటిజన్. డ్రైవర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌తో కలిసి డ్రైవ్‌కి వెళ్లారు. వారు కారుకి గ్యాస్ నింపుతుండగా.. మా అమ్మ పక్కన ఉన్నారు. ఈ క్రమంలో ఓ కారు ఆమెను ఢీకొట్టి వెళ్లిపోయింది’ అని రాసుకొచ్చారు. ఇది ఉద్దేశపూర్వకంగానే చేసినట్లుందని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ