
హైదరాబాద్, 05 ఫిబ్రవరి (హి.స.) సినిమా రంగంలో విభిన్నమైన పాత్రలతో,సహజసిద్ధమైన నటనతో మెప్పించే నటుడు మనోజ్ బాజ్పేయి (Manoj Bajpayee). లేటెస్ట్ మూవీ 'ఘూసో ఖోర్ పండిట్' (Ghooskhor Pandit) విడుదలకు ముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. టైటిల్ విషయంలో వచ్చిన అభ్యంతరాలు ఇప్పుడు సినిమాను బ్యాన్ చేయాలనే డిమాండ్ వరకు వెళ్లాయి. 'ఘూస్ఫోర్' అంటే హిందీలో లంచం తీసుకునే వ్యక్తి లేదా అవినీతిపరుడు అని అర్థం. దీనికి 'పండిట్' అనే పదాన్ని పెట్టడం వల్ల, అది కులాన్ని కించపరిచేలా ఉందని పలు బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. లంచగొండితనానికి ఒక వర్గం పేరును తగిలించడం వల్ల ఆ వర్గ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని వారు వాదిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ బయటకు వచ్చినప్పటి నుండి సోషల్ మీడియా వేదికగా నిరసనలు మొదలయ్యాయి.
గతంలో కూడా కొన్ని సినిమాలు కులం, మతం లేదా వృత్తులను తక్కువ చేసి చూపించాయనే కారణంతో వివాదాల్లో చిక్కుకున్నాయి. ఇప్పుడు 'ఘూస్ ఖోర్ పండిట్' విషయంలో కూడా అదే రిపీట్ అవుతోంది. నెటిజన్లు #BOYCOTT అనే హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాకుండా.. కథలు రాసేటప్పుడు ఇతర వర్గాలను గౌరవించడం మర్చిపోతున్నారా?” అంటూ మేకర్స్పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వెంటనే సినిమా పేరును మార్చకపోతే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, సినిమాను థియేటర్లలో విడుదల కాకుండా అడ్డుకుంటామనిహెచ్చరిస్తున్నారు. మరోవైపు చిత్ర యూనిట్ దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..