
హైదరాబాద్, 06 ఫిబ్రవరి (హి.స.)గతేడాది నవంబర్‌లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయస్థానం.. విచారించడానికి నిరాకరిస్తూ పిటిషన్ కొట్టేసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇప్పుడు మీరు ప్రచారం కోసం ఈ న్యాయ వేదికను ఉపయోగిస్తున్నారా?’’ అంటూ వ్యాఖ్యానించింది. జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి.. పిటిషన్ తీరును ప్రశ్నించారు. ఇటువంటి వాదనలు నేరుగా సుప్రీంకోర్టు ముందు ఎలా లేవనెత్తుతారని జన్ సురాజ్ పార్టీ న్యాయవాదిని నిలదీశారు. ఆర్టికల్ 32 కింద ఈ విషయాన్ని విచారించడానికి తిరస్కరించింది. బదులుగా బీహార్ హైకోర్టును సంప్రదించమని సూచించింది.
ఓటర్లకు రూ. 15,600 కోట్లు నగదు పంపిణీ చేసి అక్రమంగా ఎన్నికల్లో గెలిచారనే ప్రశాంత్ కిషోర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. అయితే జన్ సురాజ్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడానికి నిరాకరించింది. అయితే ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఇదే అభ్యర్థనతో బీహార్ హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను పిటిషనర్ పార్టీకి ఇచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్