ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్, 01 మార్చి (హి.స.) అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఖమేనీ మృతి చెందారని ప్రకటించారు.
Iran supreme leader ali khamenei is dead reports state


ఇరాన్, 01 మార్చి (హి.స.)

అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఖమేనీ మృతి చెందారని ప్రకటించారు. తొలుత దీనిని ఇరాన్ ఖండించింది. చివరకు ఖమేనీ చనిపోయినట్లు ఆ దేశ మీడియా కన్ఫార్మ్ చేసింది. ఖమేనీతో పాటు ఆయన కూతురు, అల్లుడు సహా అనేక మంది కుటుంబ సభ్యులు కూడా ఈ దాడిలో మరణించారు. ఖమేనీ మరణ వార్తను అంతకుముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. ఖమేనీని ‘‘చరిత్రలో అత్యంత క్రూరమైన వ్యక్తులలో ఒకరు’’ అని అభివర్ణించిన ట్రంప్.. ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛ కోసం ఇది ఒక గొప్ప అవకాశమని అన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైతం ఖమేనీ స్థావరాన్ని పూర్తిగా నేలమట్టం చేశామని సూచించారు. ఇది ఖచ్చితమైన సమాచారంతో చేసిన సర్జికల్ స్ట్రైక్ అని ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి.

బలిదానం

ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ఖమేనీ మరణాన్ని గౌరవప్రదమైన బలిదానంగా పేర్కొంది. ఈ దాడికి కారణమైన అమెరికా, ఇజ్రాయెల్లపై తీవ్రమైన ప్రతీకార చర్యలు తీసుకుంటామని IRGC హెచ్చరించింది. అంతేకాకుండా ఈ క్లిష్ట సమయంలో జాతీయ ఐక్యతను ప్రదర్శించాలని ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చింది.

ఖమేనీ మరణంతో ఇరాన్లో 40 రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. ప్రస్తుతం టెహ్రాన్ వీధులు భయాందోళనలతో నిర్మానుష్యంగా మారాయి. సుప్రీం లీడర్ చిత్రపటాలతో ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడిని పిరికి దాడిగా పేర్కొంటూ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో భారీ యుద్ధానికి లేదా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమోనని ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఇరాన్లో అధికార వారసత్వానికి సంబంధించి పెద్ద సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande