
నాగర్కర్నూల్, 01 మార్చి (హి.స.)
టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత తొలిసారిగా విజయ్ తండ్రి స్వగ్రామానికి వెళ్లనున్నారు. నూతన దంపతులుగా వారు మార్చి 2వ తేదీ సోమవారం నాగర్కర్నూల్ జిల్లా, బల్మూరు మండలం, తుమ్మనపేట గ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
వివాహానంతర సంప్రదాయాల్లో భాగంగా ఈ కొత్త జంట తమ పూర్వీకుల గ్రామంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం గ్రామస్థుల కోసం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ వేడుక కోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో విజయ్, రష్మికల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. తెలుగు, కొడవ సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. వివాహం అనంతరం హైదరాబాద్కు తిరిగి వచ్చిన ఈ జంట, ఇప్పుడు తమ స్వగ్రామంలో పూజలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
గ్రామంలో కార్యక్రమాలు ముగిసిన తర్వాత, మార్చి 4న హైదరాబాద్లో సినీ పరిశ్రమ మిత్రులు, ఇతర ప్రముఖుల కోసం విజయ్-రష్మిక దంపతులు ఓ భారీ విందును (రిసెప్షన్) ఇవ్వనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV