
న్యూఢిల్లీ, 11 మార్చి (హి.స.)
అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలకు నిరసనగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ దూకుడు పెంచారు. అత్యాధునిక వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి పరీక్షలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కిమ్ తన కుమార్తెతో కలిసి పాల్గొనడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) వెల్లడించిన వివరాల ప్రకారం... 'చోయ్ హ్యోన్' అనే ఏడాది వయసున్న అధునాతన యుద్ధ నౌక (డిస్ట్రాయర్) నుంచి ఈ క్షిపణులను ప్రయోగించారు. ఉత్తర కొరియా పశ్చిమ తీరంలోని లక్షిత దీవులను ఈ క్షిపణులు విజయవంతంగా ఛేదించాయి. నౌకాదళం అటాకింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించడంతో పాటు, సైనికులకు ఆయుధాల వినియోగంపై అవగాహన కల్పించడమే ఈ పరీక్షల ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా కిమ్ పేర్కొన్నారు.
గతంలో జరిగిన క్షిపణి పరీక్షల సమయంలో కిమ్ ఒక్కరే ఉండగా, ఈసారి ఆయన కూతరు కిమ్ జు ఏ (Kim Ju Ae) కూడా కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు 13 ఏళ్ల వయసున్న ఆమె, 2022 చివరి నుంచి వరుసగా సైనిక పరేడ్లు, క్షిపణి ప్రయోగాల్లో తండ్రి వెంటే కనిపిస్తున్నారు. కిమ్ తర్వాత ఆమెనే దేశాధినేతగా బాధ్యతలు చేపడతారని (Successor) దక్షిణ కొరియా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కాగా, అమెరికా, దక్షిణ కొరియాలు సోమవారం నుంచి 11 రోజుల పాటు 'ఫ్రీడమ్ షీల్డ్' పేరుతో భారీ సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. వీటిని ఉత్తర కొరియా తమపై దాడికి చేస్తున్న సన్నాహాలుగా (Invasion Rehearsal) భావిస్తోంది. ఈ నేపథ్యంలో కిమ్ సోదరి,
కీలక అధికారిణి కిమ్ యో జోంగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘శత్రువుల దురాక్రమణ చర్యలను అడ్డుకోవడానికి మా వద్ద ఉన్న అణ్వాయుధ నిరోధక శక్తి ఎంత శక్తివంతమైనదో రుజువు చేస్తాం' అని ఆమె హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా రాయిటర్స్ తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..