
హైదరాబాద్, 11 మార్చి (హి.స.)ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతోపాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు సంధించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. దేశ యువతపై ఆయనకు అవగాహన లేదంటూ రాహుల్ తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ యువరాజుకి ఏమీ తెలీదంటూ ఆయనపై పరోక్ష విమర్శలు చేశారు. దేశ అభివృద్ధిని కాంగ్రెస్ యువరాజు చూడలేక పోతున్నారంటూ రాహుల్ తీరుపై మండిపడ్డారు.
బుధవారం కేరళలోని ఎర్నాకులంలో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. యుద్ధం పేరుతో తనను కాంగ్రెస్ పార్టీ దూషిస్తోందని తెలిపారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై కాంగ్రెస్, వామపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. గల్ఫ్లో భారతీయులు చిక్కుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందన్నారు. ఆయా దేశాల్లోని భారతీయులను కాపాడేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ఇక ఈ పర్యటనలో పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేశారు. అలాగే వివిధ పథకాలను ఆయన ప్రారంభించారు. ఈ పర్యటన అనంతరం తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలో పలు అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపన చేయనుండడంతోపాటు వివిథ పథకాలను ప్రారంభించనున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
మరికొద్ది రోజుల్లో తమిళనాడు, కేరళలతోపాటు అసోం, మేఘాలయా, పుదుచ్చేరి అసెంబ్లీలకు మార్చి నుంచి మే మాసాల మధ్య ఎన్నికల నగారా మోగనుంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో అధికారం అందుకోవాలని బీజేపీ, కాంగ్రెస్తోపాటు వామపక్ష పార్టీలైన కమ్యూనిస్టు పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఆ క్రమంలో ప్రధాని మోదీ బుధవారం కేరళ,తమిళనాడుల్లో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్