
ఆదిలాబాద్, 13 మార్చి (హి.స.)
టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లు ఇచ్చిన ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత సందడి మొదలైంది. కీలకమైన కాంగ్రెస్ పార్టీ మండల శాఖల అధ్యక్షులు పట్టణ కమిటీ అధ్యక్షులు ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈనెల 14వ తేదీలోగా మండల పట్టణ కమిటీల అధ్యక్షులను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు అనంతరం 26వ తేదీలోగా అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు ఇతర పార్టీ పదవులతో కూడిన పూర్తిస్థాయి కమిటీలను వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
టిపిసిసి ఆదేశం మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మండలాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షులు రానున్నారు ఈ మేరకు ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల్లో ఆయా జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కసరత్తు మొదలుపెట్టారు. టిపిసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మార్క్ మండల స్థాయి ఎన్నికలపై కూడా కనిపిస్తున్నది గతంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జీలు శాసనసభ్యులు పార్లమెంట్ ఇన్చార్జిలు కూర్చుని మండల పార్టీ అధ్యక్షులను ఖరారు చేసే పరిస్థితి ఉండేది. అయితే తాజాగా పార్టీ మండల శాఖల అధ్యక్షులను ఖరారు చేసే విషయంలో ముందుగా ఆశావహులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. డిసిసి అధ్యక్షులు మండలాల వారీగా పర్యటనలు జరిపి, లేదంటే నియోజకవర్గ కేంద్రంలో, బ్లాక్ స్థాయిలో ఆశావాహులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు.
ఒకటి కన్నా ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్లయితే వాటిని పరిశీలించి జిల్లా కాంగ్రెస్ స్థాయిలో ఫైనల్ చేయనున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి వారికి మండల/ పట్టణ శాఖ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వనున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో మిగతా జిల్లాల కన్నా ముందుగా అక్కడి డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణ జిల్లా వ్యాప్తంగా పర్యటించి మండల శాఖ అధ్యక్ష పదవులు ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం పూర్తి చేశారు. మిగతా జిల్లాల్లోనూ ఇప్పటికే కొందరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను కలిసి దరఖాస్తులు ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా ఈనెల 13వ తేదీలోగా కమిటీలకు అధ్యక్షులను ఫైనల్ చేయనున్నారు. దీంతో ఆయా మండలాలకు కొత్తగా ఖరారు కానున్న అధ్యక్షులపై ఉత్కంఠ నెలకొంది.
మండల శాఖలకు అధ్యక్షులను ప్రకటించిన తర్వాత ఈనెల 26వ తేదీలోగా మిగతా పూర్తిస్థాయి కమిటీలను ఖరారు చేసినందుకు చర్యలు తీసుకుంటున్నారు.
అధ్యక్ష పదవితో పాటు కీలకమైన ప్రధాన కార్యదర్శి కోశాధికారి సహా మండల కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి ఉపాధ్యక్షులు తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పదవులను సైతం ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ ముఖ్య నేతలను సమన్వయం చేసుకొని ప్రకటించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు