
హైదరాబాద్, 02 మార్చి (హి.స.)వికారాబాద్ వేదికగా జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల సమావేశంలో రాజ్యసభ సభ్యుల ఎంపికపై పార్టీ అగ్రనేతలు మధ్య సోమవారం కీలక చర్చ జరిగింది. సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర నేతలను పార్టీ అగ్రనేతలు సూచించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయని బలమైన నేతలకు ఈ సీట్లు కేటాయించాలనే అంశంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. ఎంపీల రేసులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వీ హన్మంతరావు, బెల్లయ్య నాయక్, దొమ్మాటి సాంబయ్య పేర్లను ఈ సందర్భంగా వారు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
రెండు రోజుల్లో రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించేలా పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ రాజ్యసభ సభ్యుల ఎంపికపై జరిగిన చర్చలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ న్యాయవాది, మాజీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీని తమిళనాడు నుంచి రాజ్యసభకు పంపేందుకు తెలంగాణ నేతలు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్