
అమరావతి, :రానున్న మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది.
ఇక శనివారం ఉత్తరాంధ్రతోపాటు కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఆదివారం మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాల్లో.. పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ వర్షాల నేపథ్యంలో పంటలను కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాలని రైతులకు విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
అలాగే వర్షాలు కురుస్తున్న సమయంలో వృక్షాలు, భారీ హోర్డింగులు కింద నిల్చో వద్దని సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ