ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. డెయిరీ, పశుసంవర్ధక ఫారాలకు భారీ ఊరట
పశుసంవర్ధక రంగానికి ఏపీ సర్కార్ భారీ ఊరట కల్పించింది. పట్టణాల్లో పశుపోషకులకు అభివృద్ధి ఛార్జీల నుంచి మినహాయింపునిచ్చింది. భవన అనుమతుల రుసుములో సడలింపులు చేసింది.
Minister


హైదరాబాద్, 21 మార్చి (హి.స.)పశుసంవర్ధక రంగానికి ఏపీ సర్కార్ (AP Govt) భారీ ఊరట కల్పించింది. పట్టణాల్లో పశుపోషకులకు అభివృద్ధి ఛార్జీల నుంచి మినహాయింపునిచ్చింది. భవన అనుమతుల రుసుములో సడలింపులు చేసింది. ఈ సందర్భంగా అమరావతిలోని సచివాలయంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు(శనివారం) మాట్లాడారు. రాష్ట్రంలో పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేస్తూ పశుపోషకులు, చిన్నరైతులకు పెద్దఎత్తున ఊరటనిచ్చేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఏపీలోని పట్టణ స్థానిక సంస్థలు, పట్టణ అభివృద్ధి సంస్థల పరిధిలో డెయిరీ ఫారాలు, గొర్రెలు/మేకల పెంపకం కేంద్రాలు, పందుల పెంపకం యూనిట్లు, ఇతర పశుసంవర్ధక ఫారాలకు బెటర్మెంట్, డెవెలప్మెంట్ ఛార్జీలు మినహాయింపునిచ్చినట్లు మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ ఫారాలకు భవన అనుమతి/లైసెన్స్ రుసుమును గ్రామ పంచాయతీల్లో వసూలు చేసే రుసుముకు సమానంగా నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ నిర్ణయం ద్వారా పట్టణ ప్రాంతాల్లో పశుపోషణపై ఆధారపడిన రైతులు, చిన్న వ్యవసాయదారులకు ఆర్థిక భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని మంత్రి చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయంతో మరింత మందికి స్వయం ఉపాధి, సమృద్ధి లభిస్తుందని వెల్లడించారు. గత జూన్లో జరిగిన సీఎం కాంక్లేవ్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande