
హైదరాబాద్, 21 మార్చి (హి.స.)కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డితో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ల భేటీ ముగిసింది. పార్టీ పెద్దల తీరుపై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి.. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి.. బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో జీవన్ రెడ్డిని కలిసిన మంత్రులు.. ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. చాలా సమయం జీవన్ రెడ్డితో చర్చలు జరిపిన మంత్రులు.. పార్టీలో ఆయనకు సముచిత ప్రాధాన్యం దక్కేలా అధిష్ఠానం చూసుకుంటుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, వీరి బుజ్జగింపులు సఫలీకృతం అయినట్లుగా కనిపించడం లేదు.
జీవన్ రెడ్డితో భేటీ అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. పార్టీ మారే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని జీవన్ రెడ్డిని కోరామని మంత్రి తెలిపారు. జీవన్ రెడ్డికి పార్టీ అండగా నిలబడే ఆలోచన చేస్తుందన్నారు. ఆయనతో చర్చించిన అంశాలను పార్టీ, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. జగిత్యాల ప్రాంతానికి జీవన్ రెడ్డి పెద్దదిక్కు అని.. అభివృద్ధి కోసమే 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. జీవన్ రెడ్డి గురించి తెలంగాణ రాష్ట్రంలో తెలియని వారు ఎవరూ ఉండరన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల గొంతుకగా ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి అని అన్నారు. జీవన్ రెడ్డి బాధపడితే తాము బాధపడినట్లేనని అన్నారు. కాంగ్రెస్ నాయకులు మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు జీవన్ రెడ్డితో గతంలో మాట్లాడారని మంత్రి తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను జీవన్ రెడ్డి తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ వివరాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి చెప్పారు.
తన పట్ల పార్టీ పెద్దలు అనుసరిస్తున్న వైఖరిపై మంత్రుల వద్ద జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ పార్టీలో ఇంకా ఎందుకు కొనసాగాలని మంత్రులను ప్రశ్నించారు జీవన్ రెడ్డి. పార్టీలో గౌరవం లేనప్పుడు ఎందుకు ఉండాలని నిలదీశారు. దీంతో మీ సమస్యకు పరిష్కారం ఏంటని జీవన్ రెడ్డిని ప్రశ్నించారు మంత్రులు. స్పందించిన జీవన్ రెడ్డి.. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టడమే తన సమస్యకు పరిష్కారమని మంత్రులకు తేల్చి చెప్పారు. ఇన్ని అవమానాలు భరిస్తూ పార్టీలో ఎందుకు ఉండాలని అడుగుతున్న తన కుమారులకు ఏం సమాధానం చెప్పాలని మంత్రులను అడిగిన జీవన్ రెడ్డి.. సారీ చెప్పి సమావేశాన్ని ముగించేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్