
హైదరాబాద్, 23 మార్చి (హి.స.) భారతీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీ నష్టాల (Huge losses) ను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల లోని ప్రతికూల పవనాలకు తోడు దేశీయంగా నెలకొన్న ఆందోళనలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో సోమవారం ఉదయం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 1,481.95 పాయింట్లు పతనమై73,051.01 వద్ద ట్రేడవుతుండగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 415.95 పాయింట్లు కోల్పోయి 22,698.55 వద్ద కొనసాగుతోంది. ఈ ఆకస్మిక పతనంతో ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లలో ఆవిరైపోయింది.
మార్కెట్ పతనానికి మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలే ప్రధాన కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ VS ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చడంతో గ్లోబల్ మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. ఇరాన్ తన ఇంధన వనరులపై దాడులు జరిగితే ప్రతిఘటిస్తామని హెచ్చరించడం, మరోవైపు అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉండటంతో ముడిచమురు (Brent Crude) ధరలు మళ్ళీ బ్యారెల్కు $112 దాటాయి. ఇది భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ద్రవ్యోల్బణ భయాలను పెంచింది.
మరోవైపు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (Flls) భారత మార్కెట్ల నుంచి భారీగా నిధులను ఉపసంహరించుకోవడం మార్కెట్పై ఒత్తిడి పెంచింది. గ్లోబల్ రిస్క్ పెరగడంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన బాండ్లు, బంగారం వైపు మళ్లుతున్నారు. దీనికి తోడు రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 93.83 వద్ద ఆల్టైమ్ కనిష్టానికి పడిపోవడం కూడా మార్కెట్ కుప్పకూలడానికి ఒక ముఖ్య కారణమైంది. బ్యాంకింగ్ మరియు ఐటీ రంగానికి చెందిన దిగ్గజ షేర్లు భారీగా నష్టపోవడంతో సూచీలు కోలుకోలేక పోయాయని నిపుణులు తెలుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..