
ఢిల్లీ, 23 మార్చి (హి.స.)పశ్చిమాసియా (West Asia)లో యుద్ధం పీక్స్కు చేరిన వేళ వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)పై ఇరాన్ పట్టు బిగిస్తోంది. తాజాగా, ఈ జలసంధి గుండా ప్రయాణించే ఒక్కో వాణిజ్య నౌక నుంచి 2 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు 16.7 కోట్ల రూపాయలు రవాణా రుసుము (Transit Fee) వసూలు చేస్తున్నట్లుగా ఇరాన్ జాతీయ భద్రతా కమిటీ సభ్యుడు, ఎంపీ అలాద్దీన్ బ్రౌజెర్డి (Aladdin Browzerdi) వెల్లడించారు.
టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన బ్రౌజెర్డి.. ఇజ్రాయెల, అమెరికా కూటమితో జరుగుతున్న యుద్ధం వల్ల కలిగే ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. 47 ఏళ్ల తర్వాత హర్మూజ్ జలసంధిపై ఇరాన్ తన పూర్తి సార్వభౌమాధికారాన్ని, శక్తిని చాటుకుంటోందని అన్నారు.. తమ జలాల గుండా వెళ్లే నౌకలు తప్పనిసరిగా ఈ రుసుము చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20 శాతం ఈ జలసంధి గుండానే వెళ్తుంది. మార్చి మొదటి వారం నుంచి ఇరాన్ ఈ మార్గాన్ని మెజారిటీ దేశాలకు మూసివేసింది. కేవలం ఇరాన్ (Iran) మిత్రదేశాలు ముందస్తు అనుమతితో వెళ్లడానికి అనుమతి ఇస్తుండగా, మిగిలిన నౌకలపై భారీ పన్నులు విధిస్తోంది. మరోవైపు ఇరాన్ చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని, లేనిపక్షంలో ఇరాన్లోని విద్యుత్ ప్లాంట్లు, మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని 48 గంటల డెడ్లైన్ పెట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV