
అమరావతి, 29 మార్చి (హి.స.)
: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని పెదపేటలో త్వరలోనే రామాలయాన్ని పునర్నిర్మిస్తామని ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు అన్నారు. ప్రముఖ హిందూ సంస్థల ఆధ్వర్యంలో, ప్రముఖ శిల్పి ఈమని శివనాగిరెడ్డి నేతృత్వంలో శిల్ప, వాస్తు కళ ఉట్టిపడేలా నిర్మాణం ఉంటుందని తెలిపారు. ఆగమ శాస్త్రం ప్రకారం, కృష్ణ శిలతో కనీసం 800 ఏళ్లయినా చెక్కు చెదరని విధంగా నిర్మాణం చేపడతామన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో ఓ దేవాలయం చిత్రాన్ని పోస్టు చేశారు.
శ్రీరామనవమి సందర్భంగా ఇదే ఆలయంలో పూజలు నిర్వహించేందుకు రఘురామ వెళ్లగా.. ఆయన రాకను వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. శిథిలావస్థకు చేరిన ఆలయం స్థానంలో గొంతెనమ్మ ఆలయం కట్టాలని డిమాండ్ చేశాయి. రఘురామ వెళ్లిపోయిన తర్వాత రామాలయం కట్టాలంటున్నవారు.. వ్యతిరేకిస్తున్న దళితవర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకొని దాడులు చేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ