
హైదరాబాద్, 29 మార్చి (హి.స.)
మల్కాజిరి నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆదివారం జరిగిన శాసనసభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో కొత్తగా ప్రారంభించిన బాలవాటికల కారణంగా ప్రజలు అయోమయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. క్రెచ్, ప్రీ-ప్రైమరీ తరగతులు ఉన్న ఈ బాలవాటికల్లో ఎవరిని, ఏ తరగతిలో చేర్చాలో స్పష్టత లేకపోవడం వల్ల తల్లిదండ్రులు గందరగోళానికి గురవుతున్నారని తెలిపారు. అలాగే మల్కాజిరి నియోజకవర్గంలో సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్యపై వివరాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 948 అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, తన నియోజకవర్గంలోని సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. మల్కాజిరి నియోజకవర్గంలో 72 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవని, చాలా కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కొరత ఉందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు