
కాకినాడ , 31 మార్చి (హి.స.)
కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు బూతులు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగిపై మండిపడ్డ ఫోన్ సంభాషణ కలకలం రేపింది. దీంతో సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పిఠాపురం మున్సిపల్ కార్యాలయాన్ని సచివాలయ ఉద్యోగులు చుట్టుముట్టారు. కార్యాలయం ముందు బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బూతులు మాట్లాడిన మున్సిపల్ కమిషనర్ కనకారావు పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. తీవ్ర ఎండలోనూ ఉద్యోగులు కూర్చుండిపోయి ఆందోళన చేశారు. చిన్న స్థాయి ఉద్యోగుల పట్ల కమిషనర్ వ్యవహరించిన తీరు జుగుత్సాపకరంగా ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి.నిఖిల్ కృష్ణ మాట్లాడుతూ ఎంతో కష్టపడుతున్న సచివాలయ ఉద్యోగులను కించపరుస్తూ కమిషనర్ వ్యవహరించిన తీరు దారుణమన్నారు. పిఠాపురం మున్సిపాలిటీలో ఎంతోమంది కమిషనర్ బాధితులు ఉన్నారని, వారందరి పట్ల ప్రభుత్వం చొరవ చూపి కమిషనర్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ద్వారా అందే పథకాలు, పనులను సక్రమంగా నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులను చాలా చులకన భావంతో చూస్తున్నారని, ఇది సరికాదన్నారు. బూతులు మాట్లాడి ఉద్యోగి మనోభావాలు దెబ్బతీసిన కమిషనర్ కనకారావును విధులు నుండి తప్పించాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV