
హైదరాబాద్, 05 మార్చి (హి.స.)
కొన్ని రోజులుగా వరుస నష్టాలతో
బెంబేలెత్తిన భారత స్టాక్ మార్కెట్లు (Indian stock markets) ఇవాళ భారీ లాభాలతో కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలకు తోడు, పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టవచ్చనే ఆశలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారు. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడి 79,600 స్థాయిని దాటింది. ఇక నిఫ్టీ కూడా 150 పాయింట్ల మేర పుంజుకుని 24,600 మార్కు పైన ట్రేడ్ అవుతోంది. అదానీ పోర్ట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ షేర్లు 1 నుంచి 2 శాతం వరకు లాభాల్లో కొనసాగుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 51 పైసలు పెరిగి 91.54 వద్దకు చేరడం మార్కెట్కు కలిసొచ్చింది.
MRF సరికొత్త ప్రాజెక్ట్..
టైర్ల దిగ్గజం ఎంఆర్ఎఫ్ (MRF) తమిళనాడు ప్రభుత్వంతో రూ.5,300 కోట్ల భారీ పెట్టుబడి కోసం ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. శివగంగ జిల్లాలో కొత్త మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో ఈ షేరుపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. నేటి ట్రేడింగ్లో ఈ షేరు సుమారు 2 శాతం లాభంతో రూ.1,37,800 స్థాయి వద్ద కదులుతోంది. ఇరాన్, అమెరికా మధ్య రహస్య చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపాయి. అమెరికాలో టెక్ షేర్ల పెరుగుదల, ఆసియా మార్కెట్ల సానుకూల గమనం మన మార్కెట్లను ప్రభావితం చేశాయి. విదేశీ పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతున్నా.. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా కొనుగోళ్లు చేయడం కలిసొచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..