
ఖమ్మం, 08 మార్చి (హి.స.)
ఇన్సూరెన్స్ సొమ్ము కోసం ఓ వ్యక్తిని పన్నాగం పన్ని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మొదట ఈ ఘటనను ప్రమాదంగా భావించినా రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు నిజాలు బయటపడ్డాయి. ఈ మేరకు ఆదివారం రూరల్ పోలీస్ స్టేషన్లో వివరాలను రూరల్ సీఐ ముష్క రాజు వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నగరం గాంధీనగర్కు చెందిన చాగంటి రవి(55) పెయింటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వరుసకు బావమరిది అయిన ఖమ్మంకు చెందిన దేశబోయిన శ్రీనివాస్, స్నేహితులు బోగి రాజ్ కుమార్, జోగి వెంకటేష్, చాగంటి ప్రశాంతిలు రవి పేరు మీద రూ.66 లక్షల బీమా చేయించారు.
అ బీమా సొమ్ము, మృతుడికి ఉన్న ఏర్టిగా కార్ను కాజేసేందుకు పై నిందితులు పథకం వేశారు. ఈ పథకంలో భాగంగానే ఈ నెల 2న రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో దేశబోయిన శ్రీనివాస్ అనే వ్యక్తి(వరుసకు బామ్మర్ది ) పథకం ప్రకారం తన ఆటోలో మందు తాగుదాం అని మృతుడు రవిని బయటకు తీసుకెళ్లి అందరూ కలిసి మద్యం తాగి రూరల్ మండలం ఎం. వెంకటయ్యపాలెం శివారులో రవిని దింపి ఖమ్మం వైపు వెళ్లిపోయారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న మృతుడు చాగంటి రవి ఏమి తోచక ఎం.
వెంకటయ్యపాలెం గ్రామం వైపు నడుచుకుంటూ వెళ్తుండగా వెంకటేష్కి చెందిన కారును నిందితుడు జోగి రాజ్ కుమార్ వేగంగా నడుపుతూ వెనుక నుంచి ఢీ కొట్టి హత్య చేశారు. హత్య జరిగిన అనంతరం నిందితులు కారును మండలంలోని తనగంపాడు గ్రామంలోని వెంకటేష్ మిత్రుడైన దంచినాల సురేష్ ఇంటి వద్ద యాక్సిడెంట్ అయ్యిందని తరువాత తీసుకెళ్తా అని కావర్తో కప్పి దాచారు. అదేవిధంగా నిందితులు ఈ ఉపయోగించిన ఆటో వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీన పర్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల సమక్షంలో కారు, ఆటో వాహనాలు, నిందితుల సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు కేసులో నిందితులను అరెస్టు చేసి, చట్ట ప్రకారం రిమాండ్ కు తరలించి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ కేసును త్వరితగతిన విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులను సిబ్బందిని సీఐ అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు