
డిల్లీ, 09 మార్చి (హి.స.)అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై జరిపిన దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. అయితే ఈ ధరల పెరుగుదల కేవలం స్వల్పకాలికమేనని, ప్రపంచ భద్రత, శాంతి కోసం మనం చెల్లించే చిన్న మూల్యం మాత్రమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ట్రుత్ సోషల్' (Truth Social) లో ఒక పోస్ట్ చేశారు. ‘ఇరాన్ అణు ముప్పు పూర్తిగా తొలగిపోయిన వెంటనే చమురు ధరలు వేగంగా పడిపోతాయి. అమెరికా, అలాగే ప్రపంచ భద్రత, శాంతి కోసం ఈ మాత్రం స్వల్పకాలిక ధరల పెరుగుదలను భరించడం చాలా చిన్న విషయం’ అని ట్రంప్ తన పోస్ట్లో పేర్కొన్నారు.
1983 తర్వాత ఇదే తొలిసారి
కాగా, గత కొన్ని రోజులుగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభించినప్పటి నుంచి చమురు ధరలు భారీగా పెరిగాయి. మార్చి 1983 తర్వాత ఒకే వారంలో ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి అని అంతర్జాతీయ మీడియా స్పష్టం చేసింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం కారణంగా చమురు ఉత్పత్తి, రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఆదివారం నాటికి చమురు ధరలు ఏకంగా బ్యారెల్కు 100 డాలర్ల మార్క్ను దాటాయి. గత మూడున్నరేళ్ల కాలంలో చమురు ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం.
ఇంధన ధరల పెరుగుదలపై అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ స్పందిస్తూ.. గ్యాస్ స్టేషన్ల వద్ద అమెరికన్లకు ఈ ధరల భారం మరికొన్ని 'వారాల పాటు' తప్పకపోవచ్చని అంగీకరించారు. అయితే, ఈ ఇబ్బంది నెలల తరబడి ఉండబోదని, కొద్ది వారాల్లోనే పరిస్థితులు చక్కబడతాయని ప్రజలకు భరోసా ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV