


ముంబయి, 09,మార్చి (హి.స.) నేడు భారత స్టాక్ మార్కెట్ లో ఎక్కడ చూసినా ఎరుపుమయంగా కనపడుతుంది. మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సెన్సెక్స్ 2,300 పాయింట్లకు పైగా పతనమై 76,520 వద్దకు చేరుకోగా.. నిఫ్టీ 50 కూడా 700 పాయింట్లు నష్టపోయి 23,700 స్థాయికి పడిపోయింది. ఈ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు తుడిచిపెట్టుకుపోయింది. ముఖ్యంగా టాటా స్టీల్, ఎల్ అండ్ టి, ఎస్బీఐ, మారుతీ సుజుకీ వంటి దిగ్గజ సంస్థల షేర్లు 5 శాతం మేరా పడిపోయాయి. మార్కెట్ ఇలా పేకమేడలా కూలిపోవడానికి ప్రధానంగా కొన్నికారణాలు కనిపిస్తున్నాయి. మరి అవేంటో చూద్దామా..
మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధం:
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించారనే వార్తలు రావడంతో పరిస్థితులు మరింత విషమించాయి. ఇరాన్ కూడా డ్రోన్ దాడులతో విరుచుకుపడుతోంది. ఈ అనిశ్చితి ప్రపంచ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ముడి చమురు సరఫరా ఆగిపోతుందనే భయం నెలకొంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 30 శాతం పెరిగి బ్యారెల్ కు 118 డాలర్ల పైకి చేరింది. 2022 రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత చమురు ధరలు మళ్లీ 100 డాలర్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ