
హైదరాబాద్, 01 ఏప్రిల్ (హి.స.)
హైదరాబాద్ మహానగర పరిధిలో వికేంద్రీకృత నగర పాలనను బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధిని మూడు మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ఫిబ్రవరి 11వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మార్చి 31 వరకు ఉద్యోగుల వేతనాలు, ఇతర ఖర్చులు, బిల్లుల చెల్లింపు వంటి అంశాలను జీహెచ్ఎంసీ ద్వారానే నిర్వహించారు. అయితే 2026-27 కొత్త ఆర్థిక సంవత్సరం నేటి ప్రారంభం కావడంతో ఎవరికివారే పరిపాలన ప్రారంభించనున్నారు. ఆదాయం, ఖర్చులను సైతం ఎక్కడికక్కడే నిర్వహించనున్నారు.
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధిలోని 2,053 చదరపు కిలోమీటర్ల పరిధిని ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజ్గ్న మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)లను ఏర్పాటు చేసింది. మూడు కార్పొరేషన్ల విభజనలో భాగంగా 689 చదరపు కిలోమీటర్లతో 150 వార్డులతో కూడిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ని ఏర్పాటు చేశారు. 70 లక్షల జనాభా ఉందని అధికారులు చెబుతున్నారు.
ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, రాజేంద్రనగర్, గోల్కొండ, శంషాబాద్ జోన్లు ఉన్నాయి. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలోని 16 సర్కిళ్లు, 76 వార్డులతో కూడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ)గా ఏర్పాటు చేశారు. ఈ కార్పొరేషన్ 613 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. 31.11 లక్షల జనాభా ఉంది. మల్కాజ్గరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లలోని 14 సర్కిళ్లు, 74 వార్డులతో మల్కాజ్గరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)గా ఏర్పాటు చేశారు. 654 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 32.52 లక్షల జనాభా ఉందని అధికారులు గుర్తించారు.
జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలో సుమారు 25 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వీటిలో సుమారు 20 లక్షల మంది మాత్రమే రెగ్యులర్గా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 31 మార్చి రాత్రి 9 గంటల వరకు రూ.2,501 కోట్ల ఆస్తి పన్ను వసూలైనట్లు అధికారులు తెలిపారు. మరో రూ.50 కోట్లు వచ్చే అవకాశముందని అధికారుల అంచనా వేస్తున్నారు. మొత్తం రూ.2,550 కోట్లకు పైగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలయ్యే అవకాశం ఉందని అధికారులు లెక్కలు వేసుకుంటున్నారు. బుధవారం నుంచి వసూలయ్యే ఎర్లీబర్డ్ స్కీమ్ ట్యాక్స్ వేర్వేరుగా వసూలు చేయనున్నారు.
ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి 2026-27 సంవత్సరానికి ముందస్తుగా చెల్లించి ఎర్లీబర్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, సీఎంసీ కమిషనర్ సృజన, ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి కోరారు. ఏప్రిల్ నెలలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)కి సంబంధించిన మొత్తం ప్రాపర్టీ టాక్స్ను ముందుగానే చెల్లించే వారికి 5 శాతం రాయితీ లభించనుందన్నారు. గత సంవత్సరాల బకాయిలపై ఈ రాయితీ వర్తించదన్నారు. వన్రైమ్ సెటిల్మెంట్ ద్వారా రూ.548 కోట్లు వసూలయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..