సాగర్ హైవే పై ఉద్రిక్తత
హైదరాబాద్ నగరంలో ఆటో ఎల్పీజీ గ్యాస్ కొరత తీవ్ర రూపం దాల్చింది. గ్యాస్ కోసం గంటల తరబడి ఎదురుచూసి విసిగిపోయిన ఆటో డ్రైవర్లు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు.
సాగర్ హైవే పై ఉద్రిక్తత


హైదరాబాద్, 01 ఏప్రిల్ (హి.స.)

నగరంలో ఆటో ఎల్పీజీ గ్యాస్ కొరత తీవ్ర రూపం దాల్చింది. గ్యాస్ కోసం గంటల తరబడి ఎదురుచూసి విసిగిపోయిన ఆటో డ్రైవర్లు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. సాగర్ రింగ్ రోడ్డు, ఎల్బీ నగర్, బహదూర్పురా, రాజేంద్రనగర్ వంటి పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు, ధర్నాలతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది.

గత రెండు వారాలుగా ఈ సమస్య కొనసాగుతుండటంతో తమ జీవనోపాధి దెబ్బతింటోందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరి, రాత్రంతా వేచి ఉన్నా గ్యాస్ దొరకడం లేదని వాపోతున్నారు. నిరసనలో భాగంగా కొందరు డ్రైవర్లు రాజేంద్రనగర్లో సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేయగా, బహదూర్పురాలో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.

రాష్ట్రంలో రోజుకు 55 మెట్రిక్ టన్నుల ఆటో ఎల్పీజీ కొరత ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా విదేశాల నుంచి గ్యాస్ దిగుమతులు ఆలస్యం కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ విషయంపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించి, సరఫరాను పెంచాలని చమురు సంస్థలను ఆదేశించారు.

ఆందోళనల నేపథ్యంలో పలుచోట్ల పోలీసులు రంగ ప్రవేశం చేసి, ట్రాఫిక్ను పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. నిరసన చేస్తున్న డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే, గ్యాస్ కొరత సమస్య పరిష్కారం కాకపోవడంతో తమ ఆందోళనలు కొనసాగిస్తామని ఆటో డ్రైవర్ల సంఘాలు చెబుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande