
న్యూఢిల్లీ, 01 ఏప్రిల్ (హి.స.)
పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం భారత్లో ఇంధన ధరలకు రెక్కలు తొడుగుతున్నాయి. ఈ యుద్ధం కారణంగా దేశ ప్రజలు చమురు, గ్యాస్ ప్రభావాన్ని ఎదుర్కొంటుండగా తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) తమ ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది. వీటికి తోడు కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశానంటాయి. ఢిల్లీలో XP100 పెట్రోల్ ధర రూ.149 నుంచి ఏకంగా రూ.160 కి ఎగబాకింది. ఇక ఎక్స్ట్రా గ్రీన్ ప్రీమియం డీజిల్ ధర లీటరుకు సుమారు రూ.1.50 మేర పెరిగి రూ. రూ. 92.99 కి చేరుకుంది. అంతకు ముందు దీని ధర రూ. 91.49గా ఉండేది. ప్రీమియం పెట్రోల్ మెరుగైన ఇంజిన్ పనితీరు కోసం దీనిని హై-ఎండ్ కార్లు, సూపర్ బైక్లలో వాడుతారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, సరఫరాలో అంతరాయాల కారణంగా ఈ ధరల పెంపు అనివార్యమైందని తెలుస్తోంది.
తాజా పరిస్థితుల నేపథ్యంలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర భారీగా పెరిగింది. మార్చి 1న రూ. 1,768.50 ఉన్న సిలిండర్ ధర ఏప్రిల్ 1 నాటికి ఏకంగా రూ. 2,078.50కి చేరింది. అంటే గత నెల రోజుల్లోనే రూ.310 పెరిగింది. హైదరాబాద్ 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.194.50 కి పెరిగి రూ. 2,321 కి చేరుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు