
ఢిల్లీ, 01 ఏప్రిల్ (హి.స.)ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ధారించే చట్టబద్ధత బిల్లుకు సంబంధించిన తీర్మానాన్ని ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే, ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో రాజధాని అంశం మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. బిల్లు ప్రస్తుత స్వరూపాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రాజధానిని ఎప్పటిలోగా నిర్మిస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదని ఆయన అన్నారు. రాజధాని కోసం రైతుల నుంచి సుమారు 54 వేల ఎకరాలు సేకరించారని పేర్కొన్నారు.
అనంతరం బీజేపీ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ప్రస్థానం ప్రారంభించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అంశంలో అస్థిరత ఏర్పడిందని ఆమె విమర్శించారు. అమరావతి కోసం 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, ఏపీకి అమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుందని పురందేశ్వరి స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV