
అమరావతి, 01 ఏప్రిల్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టమని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఆయన తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతిపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి చట్టబద్ధత బిల్లు తీర్మానంపై శాసనసభలో ఒక డ్రామా నడిచిందన్నారు. బాబు దృష్టిలో పాలన అంటే దోపిడీ, అవినీతి మాత్రమేనన్నారు.
రాజ్యాంగంలో ఎక్కడా రాష్ట్రానికి రాజధాని ఉండాలన్న నిబంధన లేదని జగన్ మరోసారి అన్నారు. గతంలోనే ఈ వ్యాఖ్యలు చేసి ఆయన విమర్శల పాలయ్యారు. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుందన్నారు. రాష్ట్రానికి రాజధాని ఏది ఉండాలన్న విషయాన్ని ఆయా రాష్ట్రాలే నిర్ణయించుకుంటారని తెలిపారు. ఛత్తీస్ గఢ్, జార్ఖండ్ రాజధానులను కేంద్రం నిర్ణయించలేదని, అవే నిర్ణయించుకున్నాయని తెలిపారు. అమరావతి కేవలం చంద్రబాబు సెల్ఫ్ డబ్బానేనా? అని ప్రశ్నించారు.
ఏ దేశం పోతే ఆ దేశంలా అభివృద్ధి చేస్తానని సీఎం చెప్తాడని, నిజానికి లక్ష ఎకరాల అమరావతిలో ఇంతవరకూ కట్టిందెంత? సీఎం ఏడేళ్ల పాలనలో చేసిందేంటి? భూములిచ్చిన రైతులకు ఇచ్చిన హామీలనునెరవేర్చారా? అని నిలదీశారు. తొలిసారి తీసుకున్న 50 వేల ఎకరాల్లో రోడ్లు, కరెంట్, సీవరేజ్, వాటర్ వీటి కల్పనకు అయ్యే ఖర్చు అక్షరాలా లక్షకోట్ల రూపాయలు ఉంటుందని చంద్రబాబే లెక్కలు వేశారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ 50 వేల ఎకరాలు లక్ష ఎకరాలు అయిందని, ఒక్కొ ఎకరానికి రూ.2 కోట్లు అవుతుందన్నారు. లక్షకోట్లకే దిక్కులేదనుకుంటే అదనంగా మరో 50 వేల ఎకరాలను కేటాయించారని, అన్ని నిధులను ఎలా తీసుకువస్తారు? ఇది అదనపు ఖర్చు కాదా? అని ప్రశ్నించారు. ఒకప్పుడు అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా మారుస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ ప్లాన్ ను ఎందుకు మారుస్తున్నారని అడిగారు. దాని ఎఫెక్ట్ ఇప్పటికే రాష్ట్రంలో పడుతోందన్నారు. అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV