
హైదరాబాద్, 14 ఏప్రిల్ (హి.స.)భారాస ప్రభుత్వం కూప్పకూల్చిన రెవెన్యూ వ్యవస్థను సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పునర్నిర్మిస్తోందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూ హక్కుల పరిరక్షణ, పారదర్శకతతో కూడిన అవినీతి రహిత సేవలు సామాన్యులకు అందించే లక్ష్యంతో అమల్లోకి వచ్చిన భూభారతి చట్టం రాష్ట్ర చరిత్రలో కీలక సంస్కరణగా నిలుస్తోందన్నారు. భూభారతి చట్టం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సోమవారం అధికారులతో మంత్రి సమీక్షించారు. భూభారతి చట్టానికి ముందు, ఆ తరువాత ఉన్న పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘గత ప్రభుత్వ పాలకులు సరైన విధివిధానాలు లేకుండా ఆర్వోఆర్ చట్టం-2020, ధరణి పోర్టల్ తీసుకొచ్చారు. దీంతో లక్షల మంది భూహక్కుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూమి వారి చేతుల్లోనే ఉన్నా హక్కులు నిరూపించుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ అవస్థలను తప్పించాలనే సంకల్పంతో పారదర్శకత, బాధ్యత, వేగం అనే మూడు సూత్రాలతో రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు చేరువచేయాలనుకున్నాం. గత ఏడాది ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున సీఎం చేతుల మీదుగా భూభారతి పోర్టల్ను ఆవిష్కరించాం. ప్రారంభించిన ఏడాదిలోపే 5.20 కోట్లకుపైగా ప్రజలు పోర్టల్ను సందర్శించారు. 67 లక్షల మంది పోర్టల్లో లాగిన్ అయ్యారు’’ అని వెల్లడించారు.
రైతులకు పారదర్శకంగా సేవలు అందించేందుకు..రెవెన్యూ, సర్వే, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు..కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీతో కలిసి ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను ఈ నెల 2న ఐదు జిల్లాల్లోని..ఐదు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని మంత్రి వెల్లడించారు. ‘ఐదు మండలాల్లో ప్రతి సర్వే నంబరుకు భూదార్ నంబర్ను కేటాయిస్తాం. రాష్ట్రంలో నక్షాలు లేని 373 గ్రామాల్లో రోవర్స్, ఆధునిక సర్వే సాంకేతికతతో రీసర్వే పనులు చేపట్టాం. తెలంగాణ ప్రాంతంలో 1948 నాటికి సుమారు 40 లక్షల సర్వే నంబర్లు వినియోగంలో ఉండగా, ప్రస్తుతం 2.29 కోట్లకు చేరాయి. వీటన్నింటికీ భూదార్ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. అందుకోసం 5,520 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించాం. రాష్ట్రంలోని 10,984 రెవెన్యూ గ్రామాలను క్లస్టర్లుగా విభజించి జీపీవోలను నియమించాం. భూభారతి పోర్టల్ ప్రారంభించాక 3.80 లక్షల కొత్త పాసుపుస్తకాలు జారీ చేశాం’ అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్