
హైదరాబాద్, 14 ఏప్రిల్ (హి.స.)మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో రాజకీయం చేయవద్దని... సీఎం రేవంత్రెడ్డి అవగాహనా లోపంతో ఈ బిల్లుపై లేనిపోనివి మాట్లాడుతున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన మైనింగ్ రోడ్ షో కార్యక్రమానికి హాజరైన కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘పార్లమెంట్, అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్ల కల్పనకే ప్రధాని మోదీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లపై ఎప్పుడూ సానుకూలంగా స్పందించలేదు. ఈ బిల్లును అమలు చేయాలంటే నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సి ఉన్నందున పునర్విభజన లేకుండా సాధ్యం కాదు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ ద్వారా నిష్పక్షపాతంగా పునర్విభజన ప్రక్రియ జరుగుతుంది. ఇందుకు కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. జనాభా ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గి అన్యాయం జరుగుతుందన్న ప్రచారం సరికాదు. మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. పునర్విభజన తర్వాత చప్రాసీ జాబ్ కూడా రాదంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. పదవుల కోసం దిల్లీకి డబ్బులు మోస్తూ తిరుగుతున్నది రేవంత్రెడ్డే తప్ప భాజపాలో అలాంటి సంస్కృతి లేదు’’ అని పేర్కొన్నారు.
అంతకుముందు ‘‘క్రిటికల్ మినరల్ బ్లాక్స్ 7వ దశ వేలం, రెండో విడత ఖనిజాల వెలికితీత లైసెన్స్ రోడ్ షో’’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో కిషన్రెడ్డి మాట్లాడుతూ... ‘‘గతంలో సిఫార్సుల మీద ఆధారపడి మైనింగ్ అనుమతులుండేవి. ప్రస్తుతం మైనింగ్ బ్లాకుల కేటాయింపు 100% పారదర్శకంగా వేలం ద్వారా జరుగుతోంది. రక్షణ, స్పేస్ టెక్నాలజీ, సౌరవిద్యుత్, మొబైల్ తయారీ వంటి రంగాల్లో క్రిటికల్ మినరల్స్ ఆవశ్యకతను గుర్తించి, కేంద్రం రూ.32వేల కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ను ప్రారంభించింది. విదేశాల్లోనూ మైనింగ్ బ్లాక్లను దక్కించుకొని భారత్కు అవసరమైన ఖనిజాలు తరలించేలా వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకుంటున్నాం. స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారి వరసగా రెండేళ్లు ఒక బిలియన్ టన్నుల చొప్పున బొగ్గు ఉత్పత్తిని సాధించాం. దేశంలోరానున్న 90 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా దిగుమతులను తగ్గించేందుకు రూ.8,500 కోట్ల రాయితీలతో ఏడు ప్రాజెక్టులను మంజూరు చేశాం’ అని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్