
ఢిల్లీ, 14 ఏప్రిల్ (హి.స.)కళానిధి మారన్, ఆయనకు చెందిన కేఏఎల్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్తో తమకు చాలాకాలంగా నడుస్తున్న వివాదంలో, రూ.144.5 కోట్లను తక్షణమే డిపాజిట్ చేయాలని ఒత్తిడి తెస్తే తాము కుప్పకూలుతామని ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఈ నగదు డిపాజిట్కు సంబంధించి సంస్థ చెల్లింపు గడువు ఏప్రిల్ 14వ తేదీతో ముగియనున్నది. ఈ నేపథ్యంలో స్పైస్ జెట్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా విమాన సర్వీసులకు ఆటంకం కలగడం, విమాన ఇంధన ధరలు పెరగడం వల్ల నగదు కొరత ఏర్పడిందని స్పైస్ జెట్ కోర్టుకు తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ భారీ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాల్సి వస్తే ఆర్థికంగా దెబ్బతిని తమ వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని వాపోయింది. నగదుకు బదులు గురుగ్రామ్లో తమ కంపెనీకి ఉన్న ఎకరం వాణిజ్య భూమిని సెక్యూరిటీగా పెట్టుకోవాలని కోరింది.
ఈ భూమిని అత్యవసరంగా విక్రయిస్తే 50 శాతం తక్కువ ధరకు అమ్మవలసి వస్తుందని, నష్టానికి ఆస్తులను అమ్ముకునేలా బలవంతం చేయవద్దని కోరింది. వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. స్పైస్ జెట్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi