
పాలకొల్లు,, 16 ఏప్రిల్ (హి.స.)
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడిని అత్యవసర చికిత్స నిమిత్తం గ్రీన్ఛానల్ ద్వారా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుంచి విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్లో చదువుతున్న విద్యార్థుల బృందం ప్రయాణిస్తున్న కారు పాలకొల్లు మండలం దిగమర్రులో సోమవారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కడప జిల్లా బద్వేలుకు చెందిన నరసింహారెడ్డి(20) తీవ్రంగా గాయపడగా స్థానిక జనతా ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందించారు.
ఊపిరితిత్తులు దెబ్బతిని కోమాలో ఉన్న ఆ యువకుడికి వీఏ ఎక్మో పరికరం ద్వారా శ్వాస అందించాలని క్రిటికల్ కేర్ వైద్యురాలు శ్రీసాహిత్య నిర్ణయించారు. విజయవాడ మణిపాల్ ఆసుపత్రిలో ఉన్న ఎక్మో పరికరాన్ని సాయంత్రానికి పాలకొల్లుకు రప్పించి అతడికి అమర్చారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడును వైద్యులు సంప్రదించి ఆ యువకుడిని వీలైనంత త్వరగా మణిపాల్ ఆసుపత్రికి తరలించాల్సి ఉందని తెలిపారు. దీనిపై మంత్రి స్పందించి డీజీపీతో చరవాణిలో మాట్లాడి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించారు. పాలకొల్లులో రాత్రి 8 గంటలకు బయల్దేరిన అంబులెన్స్ పోలీసు ఎస్కార్టు సాయంతో ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వేగంగా ప్రయాణించి 10.10 గంటలకు మణిపాల్ ఆసుపత్రికి చేరింది. ఒక ప్రాణాన్ని నిలబెట్టేందుకు గ్రీన్ఛానల్ ఏర్పాటు చేయడం ఉభయగోదావరి జిల్లాల్లో ఇదే మొదటిసారని వైద్యులు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ