
విశాఖపట్నం, 17 ఏప్రిల(హి.స.)
,గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భీమునిపట్నం జోన్లోని వలందపేట జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. అదే రహదారిలో వెళ్తున్న వాహనదారులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీ టీవీ కెమెరా ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్లే రహదారిలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
భీమిలి బీచ్ రోడ్డులో గత అర్థరాత్రి సమయంలో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల్లో ముగ్గురు తెలంగాణ వాసులు ఉన్నారని పోలీసులు వివరించారు. మద్యం సేవించి వేగంగా వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ