డాలర్ పై రూపాయి పైచేయి: ఆర్బీఐ కీలక నిర్ణయంతో పెరిగిన విలువ
డాలర్ పై రూపాయి పైచేయి: ఆర్బీఐ కీలక నిర్ణయంతో పెరిగిన విలువ
Bharat rupee


హైదరాబాద్, 17 ఏప్రిల్ (హి.స.)

అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి శుక్రవారం ట్రేడింగ్లో గణనీయమైన బలాన్ని చాటింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకున్న ఒక వ్యూహాత్మక చర్య రూపాయి విలువ పెరగడానికి ప్రధాన కారణమైంది. సాధారణంగా ప్రభుత్వ రంగ చమురు శుద్ధి సంస్థలు తమ దిగుమతుల కోసం మార్కెట్ నుండి నేరుగా డాలర్లను కొనుగోలు చేస్తుంటాయి. దీనివల్ల డాలర్కు డిమాండ్ పెరిగి రూపాయిపై ఒత్తిడి పెరుగుతుంది. అయితే.. ఈసారి అలా కాకుండా ఒక ప్రత్యేక క్రెడిట్ లైన్ను ఉపయోగించుకోవాలని ఆర్బీఐ ఆదేశించడంతో, బహిరంగ మార్కెట్లో డాలర్లకు డిమాండ్ తగ్గి రూపాయి విలువ 25 పైసలు లాభపడి 92.95 వద్ద స్థిరపడింది.

మరోవైపు.. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు కూడా రూపాయికి అనుకూలంగా మారాయి. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్ -లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందన్న వార్తలు, అలాగే అమెరికా-ఇరాన్ చర్చలలో పురోగతి కనిపిస్తుందన్న అంచనాలు ప్రపంచవ్యాప్తంగా మదుపర్లలో నమ్మకాన్ని నింపాయి. దీనికి తోడు దేశీయ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభం కావడంతో రూపాయికి మరింత మద్దతు లభించింది. అయితే.. గ్లోబల్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ ఇప్పటికీ బలంగానే ఉండటంతో రూపాయి లాభాలు కొంతమేర పరిమితమయ్యాయి.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande